*నీతి కథలు - 14
*దయ్యాల సంచీ*
ఒక ఊరి ధనికులైన భార్యాభర్తలకి జిన్‌హో అనే కొడుకు ఉండేవాడు. కొడుకును పెంచడానికి వాన్‌క్యూన్ అనే ఒక వృద్ధ సేవకుణ్ణి నియమించారు. అతడు పిల్లవాడికి రకరకాల కథలు చెప్పేవాడు. పిల్లవాడు కథల్ని చాలా ఇష్టంగా వినేవాడు. ఆతడు చెప్పే కథల్లో భయంకరమైన వింతజంతువులు, క్రూరమైన పులులు, దేవదూతలు, అందమైన యువరాణులు, వీరులు, కరుణాహృదయులైన రాజులు వచ్చేవారు.
వీరితో పాటు ప్రతి కథలోనూ ఒకదయ్యం తప్పకుండా వచ్చేది. ఆ కథలు జిన్‌హోకు చాలా బాగా నచ్చాయి. అందువల్ల వాటిని తను మాత్రమే వినాలని పట్టుబట్టాడు. ఆ కథల్ని సేవకుడు ఇతరులకు చెప్పడానికి అనుమతించేవాడు కాదు. తను కూడా విన్న కథలను వేరెవ్వరికీ చెప్పేవాడుకాదు.
కథలు చెప్పే సేవకుడైన వాన్‌క్యూన్ దయ్యాలకని ప్రత్యేకంగా ఒక తోలు సంచీని తయారు చేసి, దాన్ని జిన్‌హో పడక గదిలోని గోడకు తగిలించాడు. ప్రతిరాత్రి జిన్‌హో నిద్రపోయే ముందు సేవకుడు సంచీని ఒడిలో వుంచుకుని కథ చెప్పేవాడు. కథ ముగుస్తున్నప్పుడు సంచీ మూతిని తెరిచేవాడు. కథలోని దయ్యం అందులోకి వెళ్ళేది. అదే కథను మళ్ళీ ఎవరైనా చెబితే తప్ప ఆదయ్యం ఆ సంచీ నుంచి వెలుపలికి రాలేదు. వాన్‌క్యూన్ సంచీ మూతిని గట్టిగా బిగించి మళ్ళీ గోడకు తగిలించేవాడు.
ఇలా రోజులూ, వారాలూ, నెలలూ, సంవత్సరాలూ గడిచాయి. వాన్‌క్యూన్ ఒకసారి చెప్పిన కథను మళ్ళీ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. జిన్‌హో కూడా తను విన్న కథను మరెవ్వరికీ చెప్పలేదు. సంచీలో చేరిన దయ్యాలు వెలుపలికి వచ్చే మార్గం లేక తపించసాగాయి. కథలు చెప్పడంలో వాన్‌క్యూన్, వినడంలో జిన్‌హో నిమగ్నులై పోవడం వల్ల తోలు సంచీలో దయ్యాలు బాధతో పుట్టించే శబ్దాలను వినలేకపోయేవారు అంతలోనే జిన్‌హో పెద్దవాడయ్యాడు .
అతని తల్లి దండ్రులు ఒక చక్కని అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవాలనుకున్నారు. ఇంకొక ధనిక వర్తకుడి కూతురైన ఆ అందమైన అమ్మాయి పేరు మిన్‌జీ. పెళ్ళిరోజు రానేవచ్చింది. పెళ్ళి కొడుకు జిన్‌హో, అతని తండ్రి పెళ్ళికూతురు ఇంటికి బయలుదేరడానికి ఉదయమే సిద్ధమ య్యారు.
ఇక జిన్హొఇంటిదగ్గర రానున్న పెళ్ళికూతురికి ఆప్యాయంగా స్వాగతం పలకడానికి ఇంట్లోని పనివాళ్ళందరూ ఏర్పాట్లలో, హడావుడిగా ఉన్నారు. ముసలి సేవకుడు వాన్‌క్యూన్, ఇంట్లోని ఒక్కొక్క గదినీ పరిశీలించి చూస్తూ, ఏర్పాట్లను గమనించసాగాడు.
అలా వస్తూ, జిన్‌హో గదిలోకి తొంగిచూశాడు. ఏవో గుసగుసలు వినిపించాయి. ఒక్క అడుగు వెనక్కు వేసి సద్దు చేయకుండా ఆలకించాడు. విభిన్న కంఠస్వరాలు వినిపించాయి. ఎవరూ లేని చోట ఇన్ని కంఠస్వరాలు ఎలా వచ్చాయా అన్న ఆశ్చర్యంతో గది లోపలికి వెళ్ళాడు. అతని చూవులు తోలుసంచీ మీద పడ్డాయి. అది అటూ ఇటూ కదులుతోంది. ఆ సంచీలోంచే గుసగుసలు వినిపించాయన్న సంగతి అతడు ఊహించాడు. అవి దయ్యాల మాటలు అని గ్రహించగానే అతడు, పిల్లిలా అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి, సంచీకి చెవులు ఆనించి గుసగుసలను విన్నాడు.
‘‘కురవ్రాడికి ఈరోజు పెళ్ళి కాబోతున్నది. మనల్ని ఇన్నాళ్ళిలా ఊపిరాడ కుండా బంధించినందుకు మన పగతీర్చుకోవడానికి ఇదే సరైన సమయం. మనం వాణ్ణి చంపేద్దాం. వాడు చచ్చాక, ఎవరో ఒకరు ఈ సంచీ మూతి విప్పి మనకు విముక్తి కలిగించకపోరు!’’ ‘‘అవును, అవును, అలాగే చంపేద్దాం. అయితే ఎలా?’’ ‘‘నేను విషపు బావి కథలోని దయ్యాన్ని. పెళ్ళికూతురు ఇంటికి వెళుతూన్న దారిలో నేనా బావిని వచ్చేలా చేస్తాను. దప్పిక గొన్న వాడు బావిని చూడగానే నీళ్ళు తాగడానికి ఆగుతాడు. ఆ పైన అంతే సంగతులు ఆహాహా!’’ ‘‘బావుంది. ఒకవేళ వాడు బావివద్ద ఆగి నీళ్ళు తాగకుండానే వెళ్ళిపోయాడే అనుకుందాం. విషపు తుప్పపళ్ళ కథలోని దయ్యమైన నేను ఊరుకుంటానా? దారికి పక్కనే చెట్టుగా చేతికి అందే పళ్ళతో కనిపించి ఊరిస్తాను. పండు కోసి రుచి చూశాడంటే చాలు! వాడిపని అయిపోతుంది. ఆహాహా!’’ ‘‘ఒకవేళ దానిని కూడా తప్పించుకుని పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నాడే అనుకుందాం. నా కథలో కనకనలాడే మేకు వుంది. దానిని నేను అతడు కాలు పెట్టే మెత్తకింద దాస్తాను. కాలు మోపగానే అంతే ’ ‘‘దాన్ని కూడా తప్పించుకుంటే, నా కథలోని విష నాగ సర్పాన్ని పెళ్ళి కూతురు పడకకింద ఉంచుతాను. అర్ధరాత్రి సమయంలో అది వెలుపలికి వచ్చి, వాణ్ణి కాటేస్తుంది... దాన్నుంచి తప్పించుకోవడం వాడితరంకాదు, ఆహాహా!’’ దయ్యాల కుట్రను విన్న వాన్‌క్యూన్ దిగ్భ్రాంతి చెందాడు. అవి సంచిలోపల ఉన్నప్పటికీ హాని కలిగించగల శక్తి వాటికివున్న సంగతి అతనికి తెలుసు.
వాన్‌క్యూన్ గబగబా ఇంటినుంచి వెలుపలికి వచ్చాడు. పెళ్ళికొడుకు తెల్లగుర్రం మీద వెళుతూన్న పరివారాన్ని చేరుకున్నాడు. తిన్నగా జిన్‌హో దగ్గరికి వెళ్ళి, ‘‘అయ్యా, ఈ రోజు, నీ గుర్రాన్ని నేను ముందుండి నడుపుతాను,’’ అంటూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు. ‘‘వద్దు, నువ్వు ఇంటికి తిరిగివెళ్ళు. అక్కడ నీకు బోలెడన్ని పనులున్నాయి!’’ అన్నాడు జిన్‌హో. వాన్‌క్యూన్ అక్కడి నుంచి యజమానిని సమీపించి, ‘‘అయ్యా, ఈ రోజు చాలా గొప్ప రోజు కదా! ఈ రోజు చిన్న యజమాని గుర్రాన్ని నడిపించాలన్నది నా చిరకాల వాంఛ,’’ అన్నాడు.‘‘సరే, అలాగే కానివ్వు. అనుమతి ఇస్తున్నాను,’’ అన్నాడు జిన్‌హో తండ్రి. వాన్‌క్యూన్ పరమానందం చెందాడు. ఎలాగైనా చిన్న యజమానిని దయ్యాల నుంచి కాపాడాలన్న కృతనిశ్చయంతో, గుర్రం ముందు నడవసాగాడు.
వాన్‌క్యూన్ అనుమానించినట్లే, దారి పక్కన బావి కనిపించగానే, నీళ్ళు తెమ్మన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, బావిలోనుంచి నీళ్ళు తోడడానికి చాలా సేపవుతుంది. అంతసేపు మీరు ఈ మండే ఎండలో ఉన్నట్టయితే, పెళ్ళి దుస్తులు చెమటకు తడిసిపోగలవు,’’ అంటూ వాన్‌క్యూన్ ఆగకుండా ముందుకు వెళ్ళిపోయాడు. దాహంగా ఉన్నప్పటికీ, సేవకుడి మాటల్లోనూ నిజం ఉందని గ్రహించిన జిన్‌హో మరేం మాట్లాడలేక పోయాడు. మరికొంతదూరం ముందుకు వెళ్ళాక, బాట పక్కన వున్న చెట్టుకు తుప్పపళ్ళు చేతికి అందేలా నేలబారుగా కనిపించడంతో, ‘‘వెళ్ళి ఆ పళ్ళు కోసుకురా. వాటిని తిని దాహం చల్లార్చుకుంటాను,’’ అన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, ఇవాళ తమకు పెళ్ళి. వధువు గారి ఇంట షడ్రసోపేతంగా విందు కాచుకుని వున్నప్పుడు, ఈ తుప్పపళ్ళు తింటారా?’’ అంటూ, జిన్‌హో సమాధానానికి ఆగకుండా, గుర్రం కళ్ళాన్ని పట్టుకుని వేగంగా ముందుకు నడవసాగాడు. జిన్‌హో, సేవకుడితో వాదన ఎందుకని మౌనం వహించాడు. ఊరేగింపు ముందుకు సాగి కొంత సేపటికి పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నది. పెళ్ళి కొడుకు గుర్రంపై నుంచి కిందికి కాలుమోపి దిగడానికి వీలుగా, ఇద్దరు సేవకులు చిన్న మెత్తను తెచ్చివేశారు. వాన్‌క్యూన్, దాన్ని దూరంగా తీసివేస్తూ, ‘‘చూడండి, అవి ఎంతమెత్తగా ఉన్నాయో! మా యజమాని కాలు జారితే మరేమన్నా ఉందా. వెళ్ళి చెక్కబల్ల తీసుకు రండి,’’ అన్నాడు.
ఒక సేవకుడి దుందుడుకు ప్రవర్తనకు, జిన్‌హో, అతని తండ్రి, పెళ్ళికూతురు తండ్రితో సహా అక్కడవున్న వారందరూ విస్తుపోయారు. అయినా, సేవకులు వెళ్ళి కొయ్యబల్ల తెచ్చి వేయడంతో వాన్‌క్యూన్ చేయి అందివ్వగా, పెళ్ళికొడుకు గుర్రం పైనుంచి, కొయ్య బల్లపై అడుగు మోపి కిందికి దిగాడు. పెళ్ళికొడుకు బృందం అలంకరించబడిన ఉద్యానవనంలోకి చేరింది. అందమైన దుస్తులతో ఆభరణాలతో అలంకరించిన పెళ్ళి కూతురు మిన్‌జీని వేదిక మీదికి తీసుకువచ్చారు. పెళ్ళి ఘనంగా జరిగింది. విందు భోజనాలు ఏర్పాటయ్యాయి. అవి ముగిశాక, పెళ్ళికొడుకూ కూతురూ పడక గదికి చేరడానికి ముందే, వాన్‌క్యూన్ పెద్ద కత్తితో లోపలికి వెళ్ళాడు. పడక మీది పట్టుపరుపులను తొలగించి, వాటి కింద దాక్కునివున్న సర్పాన్ని తెగనరికాడు.
అంతలో అందరూ అక్కడికి చేరారు. ఆ దృశ్యాన్ని చూసిన జిన్‌హో, ‘‘నాన్నా, వాన్‌క్యూన్ మన ప్రాణాలు కాపాడాడు!’’ అన్నాడు కృతజ్ఞతతో. మరునాడు జిన్‌హో పెళ్ళికూతురును వెంటబెట్టుకుని తన పరివారంతో స్వగృహానికి తిరిగివచ్చాడు. విందు జరుగుతున్న సమయంలో, వాన్‌క్యూన్ జిన్‌హోను సమీపించి, నిన్నటి తన వింత ప్రవర్తనకుగల కారణాన్నీ, సంచీలోని దయ్యాల గురించీ చెప్పాడు. అంతావిన్న పెళ్ళికూతురు భర్తతో, ‘‘జిన్‌హో! ఈరోజు నుంచి నువ్వు నాకు ఆ కథలు చెప్పు. ఒక్కొక్క దయ్యంగా వదిలిపెడదాం,’’ అన్నది సంతోషంగా.
◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" యుద్ధంలో వెయ్యి మంది వీరులను సంహరించేవాడికన్నా తన మనస్సును తాను జయించినవాడే నిజమైన వీరుడు "_
_*- గౌతమ బుద్ధుడు*_
。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
♡━━━━━ - ━━━━♡
_" మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి "_
@ Class & Subject wise Study Material :
# 6th Class # 7th Class # 8th Class # 9th Class # 10th Class