Moral Story : 28

💦 *నీతి కథలు - 28

*చిట్టెలుక - కొత్త కలుగు*

అనగనగా ఓ అడవిలో ఓ చిట్టెలుక ఉంది. అది కొత్తగా కలుగు వెతుక్కుని కాపురం పెట్టింది. ఓ రోజు అది కడుపెక్కా  తినేసి, గెంతుకుంటూ కలుగుకి వచ్చేసరికి దాని కలుగు ముందు ఓ పెద్ద బండరాయి అడ్డుగా ఉంది." ఇదేంట్రా?" అనుకొని చేతితో నెట్టి చూసింది. బలంగా తోసి చూసింది. లాభం లేదని రాయిని తొలవడం మొదలు పెట్టింది. "గయ్ "మని అరుస్తూ ఆ రాయి కాస్తా లేచి కూచుంది.  రాయి అనుకొని ఎలుక తొలవబోయింది కూటి కునుకు తీస్తున్న సింహం రాజావారిని! ఎలుక కలుగు ఉన్నది సింహం ఉండే గుహలోని! బిత్తర పోయిన చిట్టెలుక పారిపోబోయింది. జూలు విదల్చి లేచి కూర్చున్న సింహం, టక్కున పంజా విసిరి ఎలుకని పట్టుకుంది. గడగడలాడిన చిట్టెలుక భోరుమని ఏడుపు లంకించుకుంది. వేలెడంత లేని దానిని చూసి సింహం  జాలిపడింది. పంజా విప్పి దానిని పొమ్మని సైగ చేసింది.

"బతుకు జీవుడా" అని అడవిలోకి పరిగెట్టిన ఎలుకకి నక్క బావ ఎదురుపడింది. "ఏం ఎలుక పిల్లా? ఎలా ఉంది కొత్త కాపురం?" అని పలకరించింది. సింహం చేతిలో చావు తప్పి కన్నులొట్టపోయిందని చెప్పబోయి తమాయించుకుంది ఎలుక. అసలే వేలెడంత లేవని, సాటి జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయ్. ఇంక ఈ  సంగతి చెప్తే ఇంకా నవ్వుతాయని అనుకుంది. "కొత్త కాపురానికేం? బ్రహ్మాండం." అని సాగిపోయింది.

కూసింత దూరం లో కనిపించిన ఆవు అత్తా, ఇంకొంచెం దూరం లో ఎదురుపడిన పంది పాపాయి, మరింత దూరం వెళ్ళాక ఎదురొచ్చిన కోతి వదిన కూడా ఇదే ప్రశ్న. "చిట్టెలుకా? కొత్త కాపురమెలా ఉందోయ్?" అని. అసలే సింహం పంజా లో చిక్కిన క్షణంలో ఆగిపోయిన గుండె, ఇప్పుడిప్పుడే ఆగి ఆగి కొట్టుకోవడం మొదలెట్టిందేమో! చిర్రెత్తుకొచ్చిన ఎలుక " నా కొంపకేం? రెండంతస్తుల ఇల్లు, రెండు మూరల ధాన్యం గాదె, నాలుగున్నర అడుగుల దిగుడు బావి, ఇంటి ముందు  పెంపుడు సింహం కాపలా!" అని గట్టిగా అరిచేసి విసవిసా వెళ్ళిపోయింది.

మర్నాడు ఉడత అబ్బాయిలు రెండు జామ పిందెలు పట్టుకొచ్చి, చిట్టెలుకకి ఇచ్చి ఆరాధనగా అడిగారు " మేం విన్నది నిజమేనా బావా?  నీ సాహసం అడవంతా చెప్పుకుంటోంది. సింహాన్ని కాపలా పెట్టుకున్నావట కొత్తింటికి? హమ్మయ్యో.. అసాధ్యుడివి!" అని. గచ్చుమన్న ఎలుక పిల్ల గుంభనం గా ఊరుకుంది.

రోజులు గడుస్తున్నాయి.   సింహం కునుకు తీస్తున్నప్పుడు, చప్పుడు కాకుండా ఎలుక తన కలుగులోకి నక్కి వెళ్తోంది. ఓ రోజు కలుగు తలుపు కిర్రుమన్న శబ్దానికి కళ్ళిప్పిన సింహం, ఎలుకని చూసి నిద్ర మత్తులో అటుతిరిగి పడుక్కుంది. ఇంకేం? ఎలుకకి కొండంత ధైర్యం వచ్చేసింది. అడవిలో అందరితో గొప్పలు పోవడం మొదలెట్టింది.

ఈ రోజు సింహం నా చెప్పుల జత మీద పడుకుంటే, ముక్క చీవాట్లు పెట్టొస్తున్నాను.
తలనొప్పిగా ఉంది. మా సింహం గురకకి నిద్ర పట్టట్లేదు.
ధాన్యం గాదె జోలికొచ్చిన చీమల దండుని తరిమేసింది మా సింహం. తెలుసా?
వెర్రిబాగుల సింహం  ఈ రోజు సెలవు కావాలంది. పిల్లల్ని చూసొస్తానని పక్క అడవికెళ్ళింది.

ఇలా కోతలు కోస్తున్న ఎలుక పిల్లని చూస్తే నక్కకి నవ్వొచ్చింది. దీనిని ఒక ఆట ఆడిద్దామనుకుంది. ఎలుకని దగ్గరికి పిలిచి " ఎలుకబ్బయీ.. నాకో సాయం కావాలోయీ! నీ వల్ల మాత్రమే అయ్యే పని." అంది. ఎలుకేమో.."చేసేద్దాం. ఏం కావాలి నీకు, నక్క బాబాయీ?" అని దర్పంగా అడిగింది. "మరేం లేదు. నేను ఉంటున్న గుహకి వాస్తు దోషం ఉందట. అందుకే నాకు పిల్లలు పుట్టట్లేదట. సింహం జూలు లోంచి ఓ నాలుగు వెంట్రుకలు తెచ్చి ఇచ్చావా, మన గుడ్ల గూబ సిధ్ధాంతి గారికి చేత యంత్రం వేయించుకుంటానూ." అంది. ఏం చెప్పాలో తెలియక గుడ్లు మిటకరిస్తూ ఇంటికి చేరింది ఎలుక. రాత్రంతా నిద్ర మానేసి ఆలోచించింది. ఉదయం బయటకు పోకుండా ఆలోచించింది. మధ్యాహ్నం తలుపు నెమ్మదిగా తీసి సింహం ఏం చేస్తోందో అని తొంగి చూద్దును కదా! సింహం వేటకెళ్ళింది. అది పడుకున్న చోట జూలు లోంచి రాలిన వెంట్రుకలు కొన్ని కనిపించాయ్ ఎలుకకి. గెంతులేసుకుంటూ అవి తీసుకుపోయి నక్కకి ఇచ్చి మీసం మెలేసింది. తన ఎత్తు పారనందుకు చింతించింది.. నక్క.

కొన్నాళ్ళు పోయాక నక్కకి మళ్ళీ ఎలుకని ఏడిపించాలనిపించింది. " నా వాస్తు దోషాలని తొలగించిన ఎలుకా!  నీ సహాయం మూలంగా మా ఇల్లు బాగుంది. మొన్నే మగ నక్క పిల్లాడు పుట్టాడు. బాలసారె చేద్దామని అనుకుంటున్నాం. సింహం చర్మపు చొక్కా కుట్టించాలని ఆశ పడుతోంది మా ఇంటిది. నువ్వు అడిగితే సింహం ప్రాణాలు ఇచ్చేస్తుంది కదా  . ఓ మూరెడు తోలు పట్టుకు రాలేవా? అని అడిగింది.

"ఇదేం ఖర్మ రా బాబూ?" అని తిట్టుకుంటూ కలుగు చేరింది చిట్టెలుక.  గుహలో పడుకున్న సింహాన్ని  చూసి లబో దిబో మని ఏడుస్తూ కాళ్ళ మీద పడింది. "ఏమయింద"ని అడిగిన సింహానికి విషయమంతా చెప్పి సాష్టాంగపడింది.
ముందు కోపం వచ్చినా, సింహానికి ఎలుక ఏడుపు చూసి జాలి వేసింది. చెవిలో ఉపాయం చెప్పింది.

మర్నాడు  సింహం ఇచ్చిన దుప్పి చర్మం  లాక్కెళ్ళి నక్క గుహ ముందు పడేసింది పోయింది ఎలుక.  అలికిడి విని బయటకు వచ్చిన నక్క దుప్పి తోలుని చూసి మోసపోయింది. నెవ్వెరపోయింది. నిజంగా  సింహాన్ని ఎలుక ఉపాయంతో చంపేసి ఉంటుందనుకొని, వింత చూసేందుకు  సింహం ఉండే గుహ వైపు దారి తీసింది. తొంగి చూసిన నక్కని పట్టుకొని చావగొట్టింది  సింహం. చావు తప్పి కన్ను లొట్టపోయిన నక్క పరుగు లంకించుకుంది. ముసి ముసి నవ్వులు నవ్వుతూ నిలబడ్డ ఎలుకని చూసి సింహం  తన దగ్గరకు పిలిచింది. భయం భయంగా దగ్గరకి వచ్చిన ఎలుకకి  ఏం చెప్పిందంటే "గొప్పలకు పోవడం ఎంత ప్రమాదకరమో చూసావా? చిట్టిదానివి చిట్టిదానిలాగే ఉండు. ఏం?" అని ఎలుకని పట్టుకొని దాని తోకని ఓ ముడి వేసి శిక్షించి వదిలింది.

ముడి పడిన తోకని విప్పుకోలేక ఆపసోపాలు పడుతూ మనసులో అనుకుంది ఎలుక " గొప్పలు పోవడమే కాదు, గొప్పవారితో పరాచికాలూ ప్రమాదమే" అని. 
             💦🐋🐥🐬💦
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" కోపం రావడం మానవ సహజం, ఐతే దాన్ని ఎప్పుడు,ఎక్కడ,ఎవరి మీద ప్రదర్శించాలో  తెలుసుకోవడమే విజ్ఞత "_
             _*- అరిస్టాటిల్*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్దమైపోదు."_

         💦🐋🐥🐳💦