నీతి కథలు - 73
నిందితుడికి ఉరితాడు సాయం!
జిమ్, బిల్ బక్లీ సమీప పట్టణం నుంచి ఇంటికి తిరిగివస్తున్నారు. మార్గ మధ్యంలో పొదల మాటున దాగివున్న ఇద్దరు హఠాత్తుగా వాళ్ళమీదికి కాల్పులు జరిపారు. ఒక తూటా గుండెల్లోకి దూసుకు పోవడంతో, బిల్ ప్రాణాలు కోల్పోయి గుర్రంపై నుంచి కిందికి ఒరిగిపోయాడు. జిమ్ గాయపడకుండా ఎలాగో తప్పించుకోగలిగాడు. కొన్ని రోజులుగా తమ ప్రాణాలను హరిస్తామని హెచ్చరికలు వస్తున్నప్పటికీ, తమ వద్ద ఆయుధాలు లేకపోవడం వల్ల ఆ ఇద్దరన్నదమ్ములు తమను తాము కాపాడుకోలేక పోయారు.
ఇది అమెరికా మిసిసిపీ, కొలంబియాలోని మారియన్ కౌంటీలో జరిగింది.
పందొమ్మిదవ శతాబ్దాంతంలో వైట్ క్యాప్స్ అనే పేరుతో రహస్య ముఠా ఒకటి ఆ ప్రాంతంలోని పేద రైతులను బెదిరిస్తూ, వేధిస్తూ ఉండేది. ఇటీవల నీగ్రో ఒకడు వాళ్ళ వేధింపుకు గురయ్యాడు. బక్లీ సోదరులు ఎక్కువ జీతం ఇస్తామనడంతో, వాడు అంతవరకు పనిచేస్తున్న ఒక వితంతువు పొలం వదిలి, బక్లీ సోదరుల పొలంలో పనిచేయడానికి చేరాడు. వాడు, తనను వేధిస్తూ, బెదిరిస్తున్న వాళ్ళను గురించి బక్లీ సోదరులకు తెలియజేశాడు. బక్లీ సోదరులు ఆ విషయాన్ని పోలీసులకూ, న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేస్తే చంపేస్తామని దుండగులు బెదిరించారు. అయితే, జిమ్, బిల్ సోదరులు కృతనిశ్చయంతో న్యాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దాని విషాద పర్యవసానంగానే ఆ ఇద్దరు సోదరులలో ఒకడు ఇప్పుడు తన అమూల్యమైన ప్రాణాన్ని కోల్పోయాడు.
తన సోదరుణ్ణి హతమార్చినవాణ్ణి గుర్తించమని, అధికారులు జిమ్‌ను అడిగారు. విల్ పర్విస్ హంతకుడని జిమ్ చెప్పాడు. విల్ పర్విస్ సమీప పట్టణమైన పర్విస్‌లో ఉంటూన్న గౌరవనీయమైన ఒక రైతుకుటుంబానికి చెందిన యువకుడు.
అనుమానితుణ్ణి వెంటనే ఖైదుచేశారు. విష…యం కోర్టుకు వెళ్ళింది. విల్ ఇరుగు పొరుగువారైన ముగ్గుర్నీ, ఇద్దరు బంధువులనూ విచారించారు. హత్య జరిగిన సమయంలో నిందితుడు ఇంటి వద్దే ఉన్నట్టు వాళ్ళందరూ చెప్పారు. అతడి తుపాకీ కూడా చాలా కాలంగా ఉపయోగించబడలేదు. అయితే, న్యాయమూర్తులు వారి వాంగ్మూలాలను శంకించారు.
అందువల్ల విల్ పర్విస్‌కు మరణ దండన విధించారు. ప్రాణాలు పోయేంతవరకు ఉరితీయాలి! అతడు ఉన్నతన్యాయ స్థానాలకు చేసుకున్న విన్నపాలు నిరాకరించబడ్డాయి.
విల్ పర్విస్‌ను ఎరిగి ఉన్న వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందారు. అలాంటి నేరాన్ని అతడు చేసి ఉంటాడని వాళ్ళు నమ్మలేకపోయారు. చర్చ్ పాస్టర్ అతన్ని జైల్లో కలుసుకున్నాడు. ఆయన కూడా నిందితుడు నిరపరాధి అయివుంటాడని భావించాడు. ఉరిశిక్షకు ముందురాత్రి ఆయన అతన్ని మళ్ళీ కలుసుకున్నాడు. అతడు సంకెళ్ళతో నేలకు బంధించబడి ఉన్నాడు. అయినా ఎంతో ప్రశాంతంగా కనిపించాడు. ‘‘నా ఆత్మ ఎలాంటి ఇక్కట్ల పాలవుతుందో అన్నదాన్ని గురించి, నా కెలాంటి విచారమూ లేదు!'' అని అతడు అన్నాడట.
మరునాడు తెల్లవారింది. అది 1894 ఫిబ్రవరి 7వ తేదీ. వేలాది మంది స్ర్తీపురుషులూ, పిల్లలూ పెద్దలూ బహిరంగ ప్రదేశంలో గుమిగూడారు. ఉరితీయడానికి అన్నీ సక్రమంగా ఉన్నాయా అని షెరీఫ్, ఇతర అధికారులు ఒకటికి రెండుసార్లు పరీక్షంచి చూశారు. ఇరవైఒక్క సంవత్సరాల రైతుయవకుడైన విల్ పర్విస్‌ను, మెల్లగా కొయ్యవేదిక మీదికి నడిపించారు. అతడే నేరస్థుడని పూర్తిగా విశ్వసించి, అతన్ని ఖైదు చేసిన షెరీఫ్, ‘‘విల్, ఆఖరు సారిగా ఏదైనా చెప్పదలుచుకున్నావా?'' అని అడిగాడు కఠిన కంఠస్వరంతో.
నిందితుడు ప్రశాంత గంభీర స్వరంతో, ‘‘నేను ఈనేరం చేయలేదు. కావాలనుకుంటే నన్ను రక్షించగలవాళ్ళు వెలుపల ఉన్నారు,'' అన్నాడు.
పాపం! విల్ పర్విస్‌ను కాపాడడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అతని చేతులు వెనక్కు కట్టబడ్డాయి. రెండు పాదాలూ ఒకటిగా బంధించబడ్డాయి. అతని తలకూ, ముఖానికీ నల్ల తొడుగు కప్పారు. అతని మెడచుట్టూ ఉచ్చుగల ఉరితాడు బిగించారు.
గుమిగూడిన జనం ఊపిరి బిగబట్టి ఉత్కంఠతతో ఎదురు చూస్తూండగా, షెరీఫ్, ‘‘దేవుడు సాయపడుగాక, విల్ పర్విస్!'' అంటూ లివర్‌ను విసిరాడు.
అందరూ కొన్ని క్షణాలు నిశ్చేతనంగా అలాగే శిలల్లా నిలబడ్డారు. వాళ్ళు తమకళ్ళను తామే నమ్మలేక పోయారు. పైన తెరువబడిన ట్రాప్ డోర్ మీదుగా ఒట్టి ఉరితాడు మాత్రం, గాలికి అటూ ఇటూ ఊగుతున్నది. విల్ పర్విస్ ఎక్కడ? ఉరికంబం దిగువ నేలపై స్పృహతప్పి పడి ఉన్నాడు. ఇంకా ఊపిరాడుతున్నది. తలపైన ముఖం మీద కప్పిన నల్లముసుగు అలాగే ఉంది. చేతులు, కాళ్ళు చేర్చి కట్టిన కట్లు అలాగే ఉన్నాయి. ఇది ఎలా జరిగింది? ఉరితాడు నుంచి జారి అతడు కిందికి ఎలా పడ్డాడు? ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య చకితుల్ని చేసిన నిగూఢ రహస్యం అది!
నిందితుణ్ణి మళ్ళీ ఉరితీయడానికి అతన్ని ఉరికంబం దగ్గరికి లాక్కువెళ్ళడానికి అధికారులు ప్రయత్నించారు. అయితే, అక్కడే ఉన్న ప్రీస్ట్ అడ్డుపడి, ‘‘విధి అతని మరణాన్ని తప్పించింది. అతన్ని మళ్ళీ ఉరితీయడం ఎలా న్యాయం?'' అని అడిగాడు. జనం కూడా అరుపులతో, కేకలతో, ఆటపాటలతో ప్రీస్ట్ వాదానికి వత్తాసు పలికారు. అద్భుతంగా నిరపరాధిని రక్షించినందుకు దేవుణ్ణి పొగిడారు. షెరీఫ్‌కు ఏంచేయాలో తోచలేదు. ప్రజల వ్యతిరేకతను చూసి భయపడ్డాడు. నిందితుణ్ణి మళ్ళీ జైల్లో వేశాడు.
అయితే, గవర్నర్‌కి అది నచ్చలేదు. విల్ పర్విస్ దోషిగా పట్టుబడ్డాడు. మరణ దండన విధించబడింది. ఒకసారి తప్పించుకుంటే, రెండవసారి ఉరితీయించాల్సిందే కదా? ఇదీ ఆయన వాదం. విల్ న్యాయవాదులు ప్రభుత్వ ఉన్నత న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తు వారి వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది.
కాబట్టి, అదృష్టవశాత్తు చావునుంచి తప్పించుకున్న రెండు సంవత్సరాల తరవాత, విల్ పర్వీస్‌ను 1895 డిసెంబర్ 12వ తేదీ రెండవసారి ఉరితీయాలని నిర్ణయించబడింది. తీర్పు పట్ల ఏమాత్రం చలించకుండా నిందితుడు పరమ ప్రశాంతంగా కనిపించాడు. ఒకసారి తనను రక్షించిన శక్తి, రెండవసారి కూడా రక్షించగలదన్న పరిపూర్ణ విశ్వాసంతో అతడు ఉన్నాడు.
కొత్త సాక్ష్యాలేవీ లభించలేదు. నిందితుడి పట్ల కట్ట కడపటి మానవీయ చర్యగా ప్రభుత్వం అతన్ని, కొలంబియా నుంచి అతని స్వస్థలం పర్విస్‌లో వున్న చిన్న జైలుకు మార్చింది. జీవిత చరమఘట్టంలో కొన్నివారాలయినా అతడు తన బంధుమిత్రుల సమీపంలో గడపడానికి అది దోహదం చేస్తుందని ప్రభుత్వం భావించింది. అది అర్ధరాత్రి సమయం. రెండవసారి అతన్ని ఉరితీయడానికి ఒకటి రెండు రోజులే ఉన్నాయి.
హఠాత్తుగా ఒక గుంపు చెరసాల తలుపులను పగలగొట్టి లోపలికి జొరబడి, కాపలాభటులను అదుపులోకి తీసుకుని, విల్ పర్విస్‌ను చెరవిడిపించింది.
గవర్నర్ మండిపడ్డాడు. విల్ పర్విస్‌ను పట్టితెచ్చిన వారికిగాని, అతని ఆచూకీ, అతన్ని చెరవిడిపించిన వారి వివరాలు అందజేసినవారికి బహుమతులు ఇస్తామని ప్రకటించాడు. ఆ చిన్న పట్టణంలోని చాలా మందికి విల్ పర్విస్‌ను చెరనుంచి కాపాడిన వారెవరో తెలుసు. అతడు ఇప్పుడు తనకుటుంబంతో కలిసి కొండలకావలనున్న అడవి ప్రాంతంలో తలదాచుకుంటున్నాడని కూడా తెలుసు. అయినా ఏ ఒక్కరుగాని ఆ సంగతిని ప్రభుత్వానికి తెలియజేసి, బహుమతిని పుచ్చుకోవడానికి ముందుకురాలేదు.
ప్రస్తుత గవర్నర్ పదవీకాలం ముగిసింది. కొత్త గవర్నర్, ప్రచార సమయంలో తను అధికారం చేపట్టగానే విల్ పర్విస్ శిక్షను తగ్గిస్తానని వాగ్దానం చేశాడు. అదే ప్రకారం పదవిని చేపట్టగానే, రహస్య స్థానం నుంచి వెలుపలికి వచ్చిన విల్ పర్విస్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాడు.
రెండు సంవత్సరాలు గడిచాయి. విల్ పర్విస్‌కు మొదట శిక్ష విధించిన న్యాయమూర్తితో సహా వేలాది మంది పౌరులు అతన్ని విడుదల చేయమని ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఆఖరికి నిందితుణ్ణి క్షమించి ప్రభుత్వం విడుదల చేసింది. అతడు తన పొలంలో పనిచేసుకోవడం ప్రారంభించాడు. త్వరలోనే చర్చ్ ప్రీస్ట్ అందాల కుమార్తెను పెళ్ళిచేసుకున్నాడు. కొంత కాలానికి ఆ దంపతులు పదకొండు మంది సంతానానికి తల్లిదండ్రులయ్యారు.
అయినా బిల్ బక్లీని చంపిన వారెవరో తెలియకుండా ఛేదించలేని నిగూఢ రహస్యంగానే కొనసాగింది!
సంవత్సరాలు దొర్లి పోయాయి. జో బియర్డ్ అనే ఒక వృద్ధరైతు, అనారోగ్యంతో మంచం పట్టాడు. మరణం సమీపిస్తున్నదనగా తానూ, వైట్ క్యాప్స్ ముఠాకు చెందిన మరొక సభ్యుడూ కలిసి బక్లీని హతమార్చామన్న అసలు విషయం బయటపెట్టాడు. ఆవార్త ఆ ప్రాంతమంతా సంచలనం రేకెత్తించింది. ప్రభుత్వం తన తప్పిదానికి క్షమాపణలు చెప్పుకుని విల్ పర్విస్‌కు ఐదు వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించింది. హంతకుణ్ణి గుర్తించడంలో పొరబడి, జిమ్ బక్లీ, తన సోదరుణ్ణి చంపింది విల్ పర్విస్ అని చెప్పాడా?
విల్ పర్విస్ ఉరిశిక్షనుంచి తప్పించుకోవడం కేవలం కాకతాళీయమా? లేక అతడూ, అతని శ్రేయోభిలాషులూ ప్రగాఢంగా విశ్వసించినట్టు, అతని అచంచల భక్తి విశ్వాసాలకూ, ప్రార్థనలకూ దేవుడు చూపిన అద్భుతమా?
◦•●◉✿ - ✿◉●•◦
🌻 మహానీయుని మాట🍁
◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
" విమర్శలకు భయపడకు, ఎదురుగాలిలోనే గాలిపటం పైకిలేస్తుంది "
- అలెగ్జాండర్ ఫ్లెమింగో
。☆✼★━━━━★✼☆。
🌹 నేటీ మంచి మాట 🌼
♡━━━━━ - ━━━━♡
" డబ్బు కాదు.. డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు. "
@ Class & Subject wise Study Material :
# 6th Class # 7th Class # 8th Class # 9th Class # 10th Class