Motivational Story : 01

బట్టలుతికాడు......బోయింగ్‌ను అతికాడు.

‘‘ఏరా రాములు? అయిదు సదివినవు ఇక సాలు. ఇక బట్టలుతికి బతుకు.’’
‘‘లేదు దొరా! నేను ఇంకా సదివి కలెట్టర్‌ను అయితా!’’
"నువ్వు సదువుకు పోతే.. వూళ్లొ బట్టలెవరు ఉతుకుతర్రా?"
‘‘బట్టలుతుకుతూ.. సదువుత దొరా!’’
‘‘కాళ్లు ఇరగ్గొడత, సదువు లేదు.. గిదువు లేదు.. సెప్పింది సెయ్‌!’’

దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత...

అమెరికాలోని శ్వేత సౌధం..

"వీ ఆర్‌ వెల్‌కమింగ్‌ రాములు. ఎం... టు రిసీవ్‌ ప్రెసిడెన్షియల్‌ యంగ్‌ ఇన్వెస్టిగేటర్‌ అవార్డ్‌ ఫ్రమ్‌ ఆనరబుల్‌ ప్రెసిడెంట్‌" అని మైక్‌లో ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఆయనకు పురస్కారాన్ని అందజేయగా కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.

పల్లెటూరి పిల్లగాడు... పశువులు కాసిండు... బట్టలుతికిండు... అంతటితో అతని కథ ముగియలేదు. 

చదువుకోసం వూరి నుంచి పారిపోయాడు. పట్నం చేరాడు. హైదరాబాద్‌కు వెళ్లాడు. దిల్లీ దాకా వెళ్లాడు. చివరికి అమెరికా చేరుకున్నాడు. అగ్రరాజ్యంలో అత్యుత్తమ ఇంజినీరుగా, బోధకునిగా, ఆచార్యునిగా మారాడు. ప్రపంచ ప్రఖ్యాత వైమానిక కంపెనీ బోయింగ్‌ సహా అనేక కంపెనీలలో డిజైన్లను, పరికరాలను రూపొందించారు. వాటికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు.

పాత వరంగల్‌ జిల్లాలోని జనగామ తాలూకా తరిగొప్పుల గ్రామానికి చెందిన మామిడాల రాములు విజయగాథ ఇది. సంకల్పం, కృషి, పట్టుదలతో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించారు. తరిగొప్పులలోని సోమయ్య, వెంకమ్మల కుమారుడైన రాములు (1949) రజకవృత్తిలో భాగంగా వూళ్లొ బట్టలుతికేవారు. తమ ఒక్కగానొక్క కొడుకైన రాములును చిన్నప్పుడే కులవృత్తిలో దింపారు. చదువుపై ఇష్టం ఉన్న రాములు వూళ్లొ బడిలో చేరారు. ఇంట్లో పనులు చేస్తూనే అయిదో తరగతి పూర్తి చేశాక.. తండ్రి చదువు ఆపేయమన్నాడు. కులవృత్తి చేయమని ఒత్తిడి తెచ్చాడు. బడికి పోతానని అతను మొరాయించడంతో ఒప్పుకున్నాడు. వూరికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని బచ్చన్నపేటకు వెళ్లి ఆరో తరగతి చదివాడా కుర్రాడు. ఏడో తరగతి నర్మెట్ట పాఠశాలలో పూర్తి చేశాడు. ఇక చదువు మాని దొరల ఇంట్లో పనిచేయాలని ఒత్తిడి తెచ్చారు తల్లిదండ్రులు. అతను ఒప్పుకోలేదు. దొరలు రాములును ఇంటికి పిలిపించి, చదువు మానేయాలన్నారు. వూళ్లొ ఉంటే చదువుకోవడం సాధ్యం కాదని అతను ఇంటి నుంచి పారిపోయాడు.

వూరు దాటిన రాములు జనగామలో ఒక హాస్టలులో చేరాడు. ఉన్నత పాఠశాలకు వెళ్లగా.. హెడ్మాస్టర్‌ అతన్ని పరీక్షించి అసాధారణ ప్రతిభ ఉందని గుర్తించి ఎనిమిదో తరగతిలో చేర్చుకున్నారు. హాస్టలులో ఉంటూ, పాఠశాలలో చదుకుంటూ 11వ తరగతి (హెచ్‌ఎస్‌సీ) పూర్తి చేశారు. 11వ తరగతిలో అప్పట్లో వరంగల్‌ జిల్లాలో మొదటి స్థానం సాధించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. టికెట్‌ తీసుకోకుండానే హైదరాబాద్‌ వెళ్లే రైలెక్కారు. సికింద్రాబాద్‌లో పట్టుకుంటారనే భయంతో మౌలాలి స్టేషన్‌లో దిగారు. ఇద్దరు విద్యార్థులు అతన్ని మల్కాజ్‌గిరి సమీపంలోని హాస్టలుకు తీసుకెళ్లారు. అక్కడి వార్డెన్‌ వెంకటప్పయ్య రాములు పూర్వాపరాలు తెలుసుకొని హాస్టలులో చేర్చుకున్నారు. తర్వాత నిజాం కాలేజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా సీటు వచ్చింది. రూ. 60 రుసుము చెల్లించాల్సి వచ్చింది. డబ్బులు లేక వివేకవర్ధిని కళాశాలలో పీయూసీలో జాయన్‌ అయ్యారు.

పీయూసీలో కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచారు. దాని తర్వాత ఉస్మానియా ఇంజినీరింగు కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగు సీటు వచ్చింది. 110 రూపాయల రుసుము చెల్సించాల్సి ఉండగా డబ్బుల్లేక బీఎస్సీలో చేరారు. ఒక స్నేహితుడు డబ్బు ఇచ్చేందుకు ముందుకురావడంతో మళ్లీ ఇంజినీరింగులో చేరాలనుకున్నాడు. మొదటి లిస్టులో చేరనందున రెండో లిస్టులో ప్రవేశానికి కళాశాల అధికారులు నిరాకరించారు. రాములు పరిస్థితిని అర్థం చేసుకున్న కళాశాల ప్రిన్సిపాల్‌ అబీద్‌ అలీ ఇంజినీరింగులో ప్రవేశానికి అనుమతించారు. హాస్టలులో ప్రవేశం కల్పించారు. ఇంజినీరింగు చేస్తూనే రుసుముల కోసం కూలీ పని చేసేవారు. ఓయూ ఇంజినీరింగు కళాశాల భవన నిర్మాణ పనుల్లో ఉన్న రాములును చూసిన గణిత అధ్యాపకుడు అతనిని చూసి ఇకపై అలాంటి పనులు చేయవద్దని సూచించారు.

1968లో ఇంజినీరింగులో చేరారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ట్యుటోరియల్స్‌లో విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ ఆర్థిక వనరులు సమకూర్చుకునేవారు. 1973లో ఇంజినీరింగు పూర్తి చేశారు. మిత్ర అనే అధ్యాపకుడు రాములు ప్రతిభను చూసి దిల్లీలోని ఐఐటీలో పరీక్ష రాయాలని సూచించారు. 1974లో ఆయన దిల్లీలో ఐఐటీ ప్రొడక్షన్‌ ఇంజినీరింగులో చేరారు. అక్కడా ప్రథమునిగా నిలిచారు. 1976లో పీహెచ్‌డీలో చేరారు. ఇదే సమయంలో విదేశీ విద్య ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోగా మంజూరయింది. ఉపకార వేతనం పూచీకత్తుకు డబ్బులు లేకపోవడంతో హైదరాబాద్‌కు వచ్చి ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. శంకరన్‌ను కలిశారు. ఆయన అప్పటి హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఉన్న గిరికి చెప్పి పూచీకత్తు ఇప్పించారు. అలా రాములుకు 1977లో అమెరికా వెళ్లేందుకు అవకాశం వచ్చింది.

వివిధ హోదాల్లో..

అమెరికాలోని సియాటిల్‌లో.. యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో చేరారు రాములు. విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగులో పీహెచ్‌డీ పూర్తి చేశారు. యాజమాన్యం ఆయన ప్రతిభను చూసి 1982లో అక్కడే అధ్యాపకునిగా నియమించింది. అధ్యాపకునిగా ఆయన బోధనతోపాటు పరిశోధన రంగాలపై దృష్టి సారించారు. సొంతంగా రెండు గ్రాడ్యుయేట్‌ ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్స్‌ను కనిపెట్టారు. వైమానిక రంగంపై పట్టు సాధించారు. వైమానిక ఇంజినీర్ల కోసం కంపోజిట్‌ మెటీరియల్స్‌, మాన్యుఫాక్చరింగ్‌లో సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. 2013 నుంచి ఇప్పటి వరకు అదే విశ్వవిద్యాలయంలో బోయింగ్‌ పానెల్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

దాతృత్వం..

అట్టడుగు వర్గం నుంచి ఉన్నతస్థానానికి ఎదిగాననే భావనతో ఆయన తన లాంటి వారికి చేయూతనిస్తున్నారు. తెలంగాణలోని వసతిగృహాల్లో వాటర్‌ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందజేస్తున్నారు. విద్యార్థినుల కోసం మరుగుదొడ్లను నిర్మించారు. తాను చదివిన పాఠశాలలో విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయ విద్యార్థుల్లో ప్రతిభావంతులైన పేద కుటుంబాల వారికి ఉపకారవేతనాలు (ఫెలోషిప్‌) ఇస్తున్నారు. ప్రతీ మూడునెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి వసతి గృహాలను, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

నా ఎదుగుదలకు వసతి గృహమే పునాదిగా నిలిచింది. మొదటి నుంచి వసతి గృహాల్లో చదువుకున్న వారి జాబితాను బయటికి తీస్తే ఎందరో ప్రతిభావంతులు వెలుగుచూస్తారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. విశ్వవిద్యాలయాలకు వీసీలుగా పనిచేస్తున్నారు. వసతిగృహాలను ప్రభుత్వం బలోపేతం చేయాలి. వాటి ద్వారా విద్యావ్యవస్థ మరింత పటిష్ఠమవుతుంది. నా జీతంలో అయిదు వేల డాలర్లను సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాను. మాతృదేశానికి రావాలని నాకు ఎంతో తపన ఉంది. హాల్‌ (HAL) తదితర సంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నా. చివరికి అమెరికానే సరైన గమ్యం అనిపించింది.

ఎక్కడి నేను.. ఎక్కడికి వచ్చాను! 

ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరిన మూడేళ్లకే 1985లో ఆయన అత్యంత ప్రతిభావంతుడైన ఉపాధ్యాయునిగా పురస్కారం పొందారు. 1986లో విశ్వవిద్యాలయంలోని టాప్‌ టెన్‌ ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.1986లో ఏఎస్‌ఎం-ఐఐఎం అంతర్జాతీయ అధ్యాపక పురస్కారం 1987లో ఎస్‌ఏఈ రాల్ఫ్‌ విద్యాపురస్కారం ఆ తర్వాత దాదాపు వందకు పైగా పురస్కారాలు లభించాయి. అమెరికాలోని శ్వేత సౌధంలో జార్జి బుష్‌ నుంచి పురస్కారం అందుకుంటున్న తరుణంలో రాములు కనులు చెమ్మగిల్లాయి.. ‘‘ఎక్కడి నేను, ఎక్కడికి వచ్చాను’’ అంటూ ఆనందభాష్పాలను రాల్చారు.

పరిశోధనల్లో మేటి..

వైమానిక రంగంలో పరికరాలు, యంత్రాల రూపకల్పనలో రాములు కీలకపాత్ర పోషించారు. విమాన డిజైన్లు, విడిభాగాలను రూపొందించారు. ప్రసిద్ధ వైమానిక సంస్థ బోయింగ్‌ విమానాల డిజైన్లు, విడిభాగాలను తయారు చేశారు. దీంతో పాటు జీఈ సూపర్‌ అబ్రేసివ్స్‌, పక్కార్‌, టీఆర్‌డబ్ల్యూ, ఫ్లో ఇంటర్‌నేషనల్‌, క్వెస్ట్‌, ఎలక్ట్రో ఇంపాక్ట్‌, కియోసిరా, పసిఫిక్‌ నార్త్‌వెస్ట్‌ ల్యాబ్స్‌, మెక్‌డొనాల్డ్‌ డగ్లస్‌ కంపెనీల ఉత్పత్తుల రూపకల్పనలో పాల్గొన్నారు. దాదాపు 300కి పైగా పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి.

కుటుంబం..

భార్య వినతి గృహిణి. కుమారులు మనస్వి, మౌర్య ఇద్దరూ బోయింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. కూతురు సౌమ్య ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్నారు.