*నీతి కథలు - 78*
*నగలను ఎలుకలు తినేస్తే...*
చాలాకాలం క్రితం రాజస్థాన్ లూనీ నదీ తీరంలోని ధానీ గ్రామంలో లక్ష్మణ్ అనే రైతూ, మనోహర్ అనే వ్యాపారీ ఇరుగు పొరుగున నివసిస్తూండే వారు. ఒకసారి వరసగా రెండు మూడేళ్ళు వర్షాలు కురవక పోవడంతో నది పూర్తిగా ఎండిపోయింది. పంటలు పండక గ్రామస్థులు కరువును ఎదుర్కోవలసి వచ్చింది. నేలనే నమ్ముకున్న లక్ష్మణ్, అతడి భార్య కామిని తీవ్రమైన ఆలోచనలో పడ్డారు.
దూర ప్రాంతానికి వెళ్ళి కొన్నాళ్ళపాటు వేరేదైనా జీవనోపాధిని వెతుక్కోవడం మంచిది అన్న నిర్ణయూనికి వచ్చారు. కామినికి ఉన్నట్టుండి తన పెళ్ళి సందర్భంగా పుట్టింటివాళ్ళు పెట్టిన బంగారు నగలు ఇంట్లో ఉండడం గుర్తుకు వచ్చి, ‘‘నగలను ఇంట్లో పెట్టి వెళ్ళడం మంచిది కాదు. అలా అని మన వెంట తీసుకువెళ్ళడం కూడా క్షేమం కాదుకదా. ఏం చేయడం?'' అని భర్తను అడిగింది. లక్ష్మణ్ కొంతసేపు ఆలోచించి, ‘‘అవును, నువ్వు చెబుతున్నదీ నిజమే. నగలను ఒక సంచీలో వేసి కట్టి ఇవ్వు.
దాచమని పక్కింటి మనోహర్‌కు ఇద్దాం. తిరిగి వచ్చాక తీసుకుందాం,'' అన్నాడు. కామినికి కూడా అది మంచి సలహాగా అనిపించింది. పక్కింటి మనోహర్ తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉంటాడు గనక, అతని వద్ద నగలు చాలా భద్రంగా ఉండగలవని భావించింది.వెంటనే నగలను ఒక సంచీలో వేసి మూటగట్టి తీసుకుని భర్తతో పాటు మనోహర్ ఇంటికి వెళ్ళింది. సమయూనికి మనోహర్ ఇంట్లో లేడు. అతడి భార్య చిరునవ్వుతో పలకరిస్తూ బయటకు వచ్చింది. ‘‘ఈ కరువు ఇంకా ఎంత కాలం ఇలాగే ఉంటుందో తెలియదు.
మేము ధానీ వదిలి మరెక్కడికైనా వెళ్ళి కొంత కాలం ఉండి రావాలను కుంటున్నాం. మేము తిరిగి వచ్చేంతవరకు ఈ మూటను మీ ఇంట్లో భద్రంగా దాచండి. ఇందులో నా నగలు ఉన్నాయి. వీటిని వెంట తీసుకువెళ్ళడం క్షేమంకాదు. తిరిగి వచ్చాక తీసుకుంటాం,'' అంటూ నగల సంచీని అందించింది కామిని. అప్పుడే మనోహర్ అక్కడికి వచ్చాడు. లక్ష్మణ్ తన భార్య చెప్పిన మాటలను అతడు మనోహర్‌తో మళ్ళీ చెప్పాడు.
‘‘నిశ్చింతగా వెళ్ళిరండి మిత్రమా. మీ నగలు మావద్ద క్షేమంగా ఉంటాయి,'' అన్నాడు మనోహర్. అతడి భార్య కూడా అదే మాట అన్నది. సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన లక్ష్మణ్, అతడి భార్య మరునాడు తెల్లవారు జామునే బయలుదేరి దూరంలోని మాలార్‌దేశ్ అనే గ్రామాన్ని చేరుకున్నారు. ఇన్నాళ్ళు వ్యవసాయం చేశాం కదా ఇప్పుడు ఇక్కడ చిన్నపాటి వ్యాపారం ప్రారంభిద్దామని లక్ష్మణ్ ఆ ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వెనక వైపున కాపురం ఉంటూ ముందు వైపున దుకాణం తెరిచాడు.
భర్త సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు భార్య దుకాణంలో ఉంటూ వ్యాపారం గమనించసాగింది. చూస్తూండగానే ఒక సంవత్సరం గడిచి పోయింది. ధానీ నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు అక్కడ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. అయినా లక్ష్మణ్ దంపతులు మరొక సంవత్సరం పాటు ఇక్కడే ఉండి వ్యాపారంలో కొంత కూడబెట్టాలనుకున్నారు. మరొక సంవత్సరంలో అనుకున్న దానికన్నా ఎక్కువగా సంపాదించుకుని, దుకాణాన్ని వేరొకరికి అమ్మేసి సంతోషంగా స్వస్థలానికి తిరుగు ప్రయూణమయ్యూరు.
ఈ రెండేళ్ళలో ధానీలోని మనోహర్ మనసులో పేరాశ పేరుకు పోయి ద్రోహచింతన ఆరంభమయింది. పక్కింటి లక్ష్మణ్ తిరిగి వచ్చాడని తెలిసినా వెళ్ళి పలకరించలేదు. ఇల్లు సర్దుకోవడంలో తలమునకలైన లక్ష్మణ్ దంపతులు కూడా దాన్ని అంతగా పట్టించుకోలేదు. రెండు రోజుల తరవాత కామిని మనోహర్ ఇంటికి వెళ్ళి, అతడి భార్యను, ‘‘అక్కయ్యూ, నా నగలు ఇస్తావా?'' అని అడిగింది. ఆ మాట వినగానే ఆమె కొంగును నోటికి అడ్డంగా పెట్టుకుని, భోరున ఏడ్వసాగింది. నిర్ఘాంతపోయిన కామిని వెంటనే తేరుకుని, ‘‘ఏమయింది అక్కయ్యూ?'' అని అడిగింది.
‘‘ఏం చెప్పమంటావు కామినీ!'' అంటూ ఆమె కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ, ‘‘నగలన్నిటినీ చిట్టెలుకలు తినేశాయి. ఆ మాట మీతో చెప్పడానికే సిగ్గుగా ఉంది. అందుకే మిమ్మల్ని పలకరించడానికి కూడా మీ ఇంటికి మా ఆయన రాలేకపోయూడు,'' అన్నది ఏడుపు గొంతుతో. కామిని మరేమీ మాట్లాడకుండా మౌనంగా తన ఇంటి కేసి నడిచింది. పొలం పనులు ముగించుకుని భర్త రాగానే విషయం చెప్పింది.
ఇద్దరూ నింపాదిగా చర్చించుకుని పక్కింటి వారితో గొడవ పడకూడదనీ, సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పి తమ సొమ్మును రాబట్టుకోవాలనీ నిర్ణయించారు. లక్ష్మణ్ కొన్ని రోజులు మనోహర్‌ను అసలు చూడకుండానే ఉండిపోయూడు. ఒకనాడు తనను చూడడానికి వచ్చిన లక్ష్మణ్‌తో, ‘‘చూసి రెండేళ్ళయింది క్షేమమే కదా?'' అని అడిగాడు మనోహర్ నవ్వుతూ. ‘‘క్షేమమే మిత్రమా! నీ సాయం కావలసివచ్చింది.
అడగవచ్చా?'' అన్నాడు లక్ష్మణ్. ‘‘అడుగు మిత్రమా! స్నేహితుడితో సంకోచం దేనికి?'' అన్నాడు మనోహర్ ఆతృతగా. ‘‘కామినికి హఠాత్తుగా జ్వరమొచ్చింది. వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి. మేము తిరిగి వచ్చేంతవరకు వాకిట్లో ఎండబెట్టిన ధాన్యాన్ని చూసుకోవడానికి మీ అబ్బాయిని కాస్త పంపుతావా?'' అని అడిగాడు లక్ష్మణ్. ‘‘తప్పకుండా పంపుతాను.
అంతమాత్రం సాయపడకపోతే నేనేం మిత్రుణ్ణి?'' అంటూ మనోహర్ తన పదేళ్ళ కొడుకును లక్ష్మణ్ వెంట పంపాడు. లక్ష్మణ్ పిల్లవాణ్ణి వెంటబెట్టుకుని పక్క గ్రామంలోని తన బంధువు ఇంట్లో వదిలి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చాడు. అక్కడ ఆడుకోవడానికి తన ఈడు వాళ్ళే ఉండడంతో పిల్లవాడు కూడా అక్కడ ఉండడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు.
వెళ్ళిన బిడ్డ పొద్దుపోయూక కూడా రాకపోయేసరికి, మనోహర్ అతడి భార్య లక్ష్మణ్ ఇంటికి వెళ్ళి అడిగారు. వారిని చూడగానే కామిని బావురుమని ఏడుస్తూ, ‘‘అయ్యో, ఏమని చెప్పను అక్కయ్యూ! ఆ పాడు గద్ద బిడ్డను అమాంతం ఎత్తుకు పోయింది. ఈ విషాదకరమైన సమాచారాన్ని మీకెలా చెప్పడమా అన్న సిగ్గుతో, మా ఆయన మీ ఇంటికేసి రాలేకుండా ఉన్నాడు!'' అన్నది.
‘‘ఏమిటీ! బిడ్డను గద్ద ఎత్తుకు పోయిందా?'' అంటూ ఆవేశపడ్డ మనోహర్, అతడి భార్య అక్కడి నుంచి వేగంగా గ్రామాధికారి వద్దకు వెళ్ళి లక్ష్మణ్ మీద ఫిర్యాదు చేశారు. గ్రామాధికారి వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని హుటాహుటిగా లక్ష్మణ్ ఇంటి వద్దకు వచ్చాడు. లక్ష్మణ్ గ్రామాధికారికి నమస్కరించాడు. ‘‘మనోహర్ కొడుక్కి ఏమయిందో చెప్పు. పిల్లవాణ్ణి గద్ద ఎలా ఎత్తుకు పోతుంది?'' అని అడిగాడు గ్రామాధికారి.
‘‘బంగారు నగలను చిట్టెలుకలు తినేసినట్టే, గద్ద పిల్లవాణ్ణి ఎత్తుకు పోయింది బాబూ. ఇందులో వింతే ముంది?'' అన్నాడు లక్ష్మణ్. ‘‘ఏమిటీ! బంగారు నగలను చిట్టెలుకలు తినేయడమా? ఇది మరీ విడ్డూరంగా ఉందే. నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు,'' అన్నాడు గ్రామాధికారి. అప్పుడు లక్ష్మణ్ రెండేళ్ళ క్రితం తాము మనోహర్ భార్య చేతికిచ్చిన నగల గురించీ, వాటిని తిప్పి అడిగితే ఎలుకలు తినేశాయని ఆమె చెప్పిన విషయమూ గ్రామాధికారికి వివరించాడు.
గ్రామాధికారి మనోహర్ కేసి చూశాడు నిజమా అన్నట్టు కోపంగా. అతడూ, అతడి భార్యా సిగ్గుతో తలలు దించుకున్నారు. ఆ తరవాత మనోహరుడి భార్య, ‘‘అయ్యూ, నేను వెళ్ళి నగలను తెస్తాను. అవి మా ఇంట్లో భద్రంగా ఉన్నాయి,'' అంటూ తమ ఇంటికేసి నడిచింది. ‘‘పిల్లవాడు కూడా మా బంధువు ఇంట్లో క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళి వెంటబెట్టుకు వచ్చి మనోహర్‌కు అప్పగిస్తాను,'' అంటూ లక్ష్మణ్ కూడా బయలుదేరాడు.
‘‘అత్యాశ హానికరం అని ఊరకే చెప్పలేదు. నమ్మకద్రోహం మహాపాపం. మనం ఒకరికి చెడు తలపెడితే మనకూ కీడే తప్ప మేలు జరగదు. గుర్తుంచుకో,'' అని మనోహర్‌ను హెచ్చరించి, గ్రామాధికారి అక్కడి నుంచి తన ఇంటి దారిపట్టాడు.
💦🐬🐥🐋
◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" బుద్ధిహీనుడు తను జ్ఞానవoతుడని అనుకుoటాడు, అయితే జ్ఞానుడు తనను తాను బుద్ధిహీనుడని లెక్కించుకుంటాడు "_
_*- షేక్ స్పియర్*_
。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
♡━━━━━ - ━━━━♡
_" పర్వతం ఎత్తు చూసి జంకితే.. శాశ్వితంగా కిందనే.. సాహసించి ఒక్కో అడుగూ పైకి నడిస్తే.. శిఖరాగ్రం మీదనే. "_
💦🐋🐥🐳💦