Moral Story : 79

 నీతి కథలు - 79

నేత్రసంజీవని

    కన్నావరంలోని చింతామణి రోగనిర్ధారణకూ, చికిత్సకూ, హస్తవాసికీ పేరుగాంచిన వైద్యుడు. అయితే, యేటా వేసవిలో ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలను పట్టి పీడించే వింత కంటి జబ్బును నయం చేయలేక బాధపడసాగాడు. ఉన్నట్టుండి కళ్ళు వాచిపోవడం, నీళ్ళుకారడం, మంట ఆ వ్యాధి లక్షణాలు. కొందరికయితే ఆ జబ్బు కారణంగా చూపు మందగించడం కూడా జరిగేది.
 
    ఆ వ్యాధికి సరైన వైద్య విధానం తెలిసి కూడా దానికి సంబంధించిన నేత్రసంజీవనీ మూలిక లభ్యం కాకపోవడం వల్ల ఆయన చికిత్స చేయలేకపోతున్నాడు. ఆ మూలిక కన్నావరానికి దక్షిణంగా కొద్ది దూరంలో ఉన్న చంద్రావళి కొండ దిగువ ఉందని ఆయనకు తెలుసు. అయితే, నరభక్షకులైన రాక్షస దంపతులు ఇటీవల అక్కడ చేరడం వల్ల, ఎవరూ ఆ దరిదాపులకు వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు.
 
    ఇలా ఉండగా, చింతామణి వద్ద కొత్తగా శిష్యుడిగా చేరిన విజయచంద్రుడనే యువకుడికి ఆ మూలికను ఎలాగైనా సంపాదించాలనే బుద్ధి పుట్టింది. అతడు ఒకనాడు దాపులనున్న మూలికలు తెస్తానని గురువుకు చెప్పి, తిన్నగా చంద్రావళి పర్వతం కేసి నడవసాగాడు.
 
    మిట్టమధ్యాహ్నానికి ఆ కొండను సమీపించి నేత్రసంజీవనీ మూలికను కావలసినంత సేకరించుకుని, ఆ దాపులనున్న చెట్ల ఫలాలను తిని, సెలయేటి నీళ్ళు తాగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో, ‘‘ఎవడివిరా నువ్వు?'' అన్న భయంకరమైన కేక వినిపించడంతో, విజయచంద్రుడు ఉలిక్కిపడి తల పైకెత్తి చూశాడు.

    ఒక రాక్షసుడు తన భార్యతో బండల పక్క నుంచి వస్తున్నాడు. వాళ్ళ భయంకర ఆకారాలను చూసి ఒక్క క్షణం భయపడిన విజయ చంద్రుడు వెంటనే తేరుకుని, భయపడి ప్రయోజనం లేదని గ్రహించి ధైర్యంగా లేచి నిలబడ్డాడు. ‘‘ఇంకా నా ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు. ఎంత పొగరు? నన్ను చూస్తూంటే భయం లేదా?'' అంటూ రాక్షసుడు రెండుఅడుగులు ముందుకు వేశాడు.
 
    అంతలో రాక్షసి అడ్డుపడి, ‘‘నీ మొహం చూసి ఎవడు భయపడతాడు? ఆ కురక్రుంక నోటి నుంచి క్షణంలో సమాధానం నేను కక్కిస్తాను చూడు,'' అంటూ ముందుకు ఉరికింది. ‘‘మగాడినైన నావల్ల కానిది, ఆడదానివి నీవల్ల ఏమవుతుంది?'' అంటూ రాక్షసుడు గుడ్లురుముతూ విజయచంద్రుడి కేసి తిరిగి, ‘‘చెప్పు, నన్ను చూస్తే నీకు భయం లేదా?'' అని గద్దించాడు.
 
    రక్కస ఆలుమగల మధ్య అంతగా పడడం లేదని వెంటనే గ్రహించిన విజయచంద్రుడు, ‘‘మిమ్మల్ని చూసి భయపడడమెందుకు? ఈ మధ్య మీకన్నా భయంకరమైన ఒక రాక్షసుణ్ణి చూశాను. అతడు నాకు కావలసినంత ధనం కూడా ఇచ్చాడు,'' అన్నాడు విజయ చంద్రుడు. రాక్షసుడు హ హ హ అని నవ్వి, ‘‘కోతలు బాగా కోస్తావురా బాలకా! నాలాంటి రాక్షసుడు నిన్ను చూడడమేమిటి? మింగకుండా వదిలిపెట్టడమేమిటి?'' అన్నాడు.
 
    ‘‘అతడికి నా సలహా కావలసివచ్చింది. అందుకే నాతో స్నేహం చేశాడు,'' అన్నాడు విజయచంద్రుడు. ‘‘రాక్షసుడికి నీ సలహా కావలసివచ్చిందా? ఆశ్చర్యంగా ఉందే! ఏమిటా సలహా?'' అని అడిగాడు రాక్షసుడు. ‘‘అలా అడుగు, చెబుతాను. ఆ రాక్షసుడు... ‘మీ మనుషులు చాలా తెలివైన వాళ్ళట కదా! పెళ్ళాలను తమ చెప్పు చేతల్లో ఎలా పెట్టుకుంటారో, నీకేమైనా చిట్కాలు తెలిస్తే చెప్పు' అని అడిగాడు,'' అన్నాడు విజయచంద్రుడు. ‘‘నువ్వు చెప్పావా?'' అని అడిగాడు రాక్షసుడు కాస్త కంఠస్వరం తగ్గించి. ‘‘చెప్పాను.

    అందుకే కదా ఆ రాక్షసుడు ఎంతగానో సంతోషించి నాకు ధనం, బంగారు కానుకలు కూడా ఇచ్చాడు,'' అన్నాడు విజయ చంద్రుడు ఏమాత్రం తొణక్కుండా. ఆ మాట వినగానే రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు. వాడి భార్య పరమగయ్యూళి. చీటికి మాటికి మాటలతో, చేతలతో వాణ్ణి సాధిస్తూ, వేధిస్తూ ఉంటుంది.
 
    పెళ్ళాన్ని అదుపులో ఉంచుకునే చిట్కాలు తెలుసుకుంటే మంచిదని అనుకుని వాడు, ‘‘ఒరే బాలకా! ఇలారా,'' అంటూ విజయ చంద్రుణ్ణి బండ చాటుకు తీసుకు వెళ్ళి, ‘‘ఆ చిట్కాలేవో నాకూ చెప్పు. నీకు కానుకలిస్తాను,'' అన్నాడు. విజయచంద్రుడు, ‘‘చెబుతాను, చెబుతాను,'' అంటూండగా వాళ్ళను వెంబడించి వచ్చిన రాక్షసుడి భార్య, ‘‘ఏరా, నన్ను లొంగదీసుకునే చిట్కాలు నా మొగుడికి చెబుతావా? నిన్నేం చేస్తానో చూడు!'' అంటూ హుంకరించింది.
 
    ‘‘వాడేం చెబితే నీకేం? నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన అధమ రక్కసివి! నువ్వు వాణ్ణిమింగడానికి నేను వదులుతాననుకున్నావా?'' అంటూ అడ్డు పడ్డాడు రాక్షసుడు. ‘‘నీ కాళ్ళ దగ్గర పడి ఉండడమా? అందుకు వేరెవతినైనా చూడు. నేను ప్రాణంతో ఉండగా అది అసాధ్యం,'' అంటూ రెచ్చిపోయింది రాక్షసి. దాంతో వాళ్ళిద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. రక్కుతూ, గిచ్చుతూ బాహా బాహీ పోట్లాటకు దిగారు.
 
    వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే, విజయ చంద్రుడు గుట్టుచప్పుడు కాకుండా మూలికలతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సాయంకాలానికి నేత్రసంజీవని మూలికలతో తిరిగివచ్చిన శిష్యుణ్ణి చూసి చింతామణి ఎంతగానో సంతోషించాడు. ‘‘ధైర్యం ఉంటేనే తెలివితేటలు ఉపయోగ పడగలవని చక్కగా నిరూపించావు నాయనా.
 
    నీ సమయస్ఫూర్తి బహుధా ప్రశంసనీయం. నీ పాటి ధైర్యం లేకే ఇన్నాళ్ళు ఆ మూలికను సంపాదించలేకపోయూను. నీ ఉపకార బుద్ధి వల్ల ఇక్కడి ప్రజల కళ్ళ జబ్బులు తప్పక తొలగిపోగలవు. ఆయుష్మాన్‌ భవ!'' అంటూ ఆయన శిష్యుణ్ణి దీవించాడు.
             
 ◦•●◉✿ - ✿◉●•◦
🌻 మహానీయుని మాట🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
" బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు "
        - చాగంటి కోటేశ్వరరావు
     。☆✼★━━━━★✼☆。
🌹 నేటీ మంచి మాట 🌼
     ♡━━━━━ - ━━━━♡
" అదృష్టం అందరి తలుపూ తట్టవచ్చు. కానీ ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది. "